VGన్యూస్: రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హితవు పలికారు. విడతల వారిగా ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. నిరుద్యోగ యువకుల కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా పాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు రూ. 424 కోట్ల మేరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను (Government Jobs) భర్తీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇటీవలి కాలంలో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయడమే కాకుండా వయో పరిమితిని కూడా సడలించామని వివరించారు. రాబోయే కాలంలో ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం రైతు, మహిళ, యువతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందని చెప్పారు. ఇలాంటి సమయంలో యువకులు సమయం వృథా చేసుకోవద్దని సూచించారు.
వరంగల్ జిల్లాకు చైతన్యం, ఉద్యమ చరిత్ర, పోరాట స్ఫూర్తి ఉందని, స్వాతంత్య్రానంతరం కూడా ఈ జిల్లా నుంచి ప్రజా జీవితంలో సర్వం ఒడ్డిన మహనీయులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను(Assembly) నిర్వహిస్తామన్నారు. అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు (KCR) సభకు హాజరై అభివృద్ధి, సంక్షేమంపై చర్చించి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అప్పుల భారం మోస్తూనే ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. బోల్తా కొట్టిన బండిని పట్టాలెక్కించామని, ఇక పరుగెత్తించడమే మిగిలిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.







