VG న్యూస్: ఈ దేశానికి వెన్నెముక రైతులే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను ఆదుకుని వారిని నిటారుగా నిలబెట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. రైతు సంక్షేమమే తమ విధానమని సీఎం అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో కలిసి రైతు ఉత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభ వేదికమీద కంప్యూటర్‌పై బటన్ నొక్కి రెండోవిడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడతూ 2 లక్షల రూపాయల మేరకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి, అధికారం చేపట్టిన ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. గతసారి కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. వ్యవసాయం దండగ కాదు పండుగ కావాలన్నదే తమ సంకల్పమన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , ధనసరి అనసూయ సీతక్క , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ఉత్తమ్ కుమార్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , వివేక్ వెంకటస్వామి , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ విప్‌లు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.







