Home తాజా వార్తలు తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే: కేసీఆర్

తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే: కేసీఆర్

VG న్యూస్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చిల్లర మాటలే తప్ప, ఒక్కటంటే ఒక్కక కార్యాచరణ లేదని బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ చీకట్లో దడుచుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతది… గుండె ధైర్యం ఉంటే అదే నీవెంట పెద్ద సైన్యమై నడుస్తుందని కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితతో కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారభించారు. జీవన్ రెడ్డి నేను మంచి స్నేహితులం, పార్టీలు వేరైనా కలిసి పనిచేశామన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుందని సర్వేలు చెప్పాయన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్‌తో పాటుగా, పార్టీ బలోపేతం కోసం తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. ఆరు నూరైనా వందకు వంద శాతం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
5 యేండ్ల పాటు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇస్తే, ఇప్పుడు ఎందుకు రావడం లేదో చెప్పాలని కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని మాట్లాడుతున్నారు. పిల్లి శాపానికి ఉట్టి తెగిపడదు. వీళ్ల శాపాలకు నేను చావను అని కేసీఆర్ అన్నారు . యూరియా బస్తా కోసం యాప్‌లు పట్టుకొని తిరిగితే రైతుల కాళ్లకి వాపులు వస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆటో అతనికి ఫోన్ చేస్తే ఎన్ని అంటే యూరియా బస్తాలు తెచ్చి ఇంట్లో వేస్తుండే అని గుర్తు చేశారు. ఓట్లు వేసేటప్పుడు చిలక్కి చెప్పినట్లు చెప్పిన, నా మాట కొంతమంది విన్నారు కొంతమంది వినలేదన్నారు. పల్లె ప్రకృతి వనాలు పెడితే కనీసం చెట్లకు నీళ్ళు పోసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు మురికి కూపాలుగా మారాయన్నారు. అందుకే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత నోటి నుంచి కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అనే మాట వచ్చిందని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కాకి మాటలే చెప్పింది తప్ప, ఒక్కరికి మంచి చెయ్యలేక పోతుందన్నారు. రాష్ట్రంలో ఎవ్వరిని కదిలించినా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారని పేర్కొన్నారు. పంట వేసిన దగ్గర నుంచి కొనేవరకు బీఆర్ఎస్ రైతులకు అండగా నిలబడిందన్నారు. బీఆర్ఎస్ హయంలో రూ.75 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ పాలనలో మంచి నీళ్ల కోసం గోసపడే పరిస్థితి వచ్చింది, మక్కలు కొనే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉండేదని. ఈరోజు భూమి అమ్మేవాడు ఉన్నడు, కానీ కొనేవాడే దిక్కులేదని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలేక పోతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకంతోనే హైడ్రా తీసి అవతల పడేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ చెయ్యాల్సిందే, అంతేగాని పేదల ఇండ్లు కూల్చవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళీ మొదలు కావాల్సిందే అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.