VGన్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. క్యూర్ పరిధిలో అఫర్డ్‌బుల్ ఎల్ఐజీ అర్బన్ హౌసింగ్ స్కీమ్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై శనివారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందన్నారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని క్యూర్ పరిధిలో చేపట్టబోయే అఫర్డ్‌బుల్ ఎల్ఐజీ అర్బన్ హౌసింగ్ పై కూడా చూపించాలన్నారు. క్యూర్ పరిధిలో పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలో ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆలోచనల మేరకు రెవెన్యూ , హౌసింగ్ విభాగాల అధికారులు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలన్నారు.
వీలైనంత త్వరితగతిన పేదలకు ఇళ్లు అందించే విధంగా స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా ఇప్పటికే ఖరారైన స్ధలాలలో పొజిషన్ తీసుకొని ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన కార్యాచరణను వేగవంతంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా కొన్ని నియోజకవర్గాలలో స్ధలాలను గుర్తించి తక్షణమే ఖరారు చేయాలన్నారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాలకు గాను ప్రతి నియోజకవర్గంలో తొలి విడతలో 500 ఇళ్లు నిర్మిస్తున్నాం. ఈ ఇళ్లకు సంబంధించి టెండర్లను వీలైనంత త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా పది ఆర్డీవో, 107 తహశీల్దార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రెండు డీఐజీ , నాలుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్, 52 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నాం. ఈ భవనాలన్నీ ఒకే నమూనాలో, ఆధునిక సదుపాయాలతో, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మిస్తున్నాం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో సోలార్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తాం అని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి వి.పి. గౌతమ్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.







