Home తాజా వార్తలు ప్రైవేట్ నర్సరీ వద్దు.. అంగన్‌వాడీ ముద్దు: మంత్రి సీతక్క

ప్రైవేట్ నర్సరీ వద్దు.. అంగన్‌వాడీ ముద్దు: మంత్రి సీతక్క

VGన్యూస్: బాల్యంలోనే విద్యకు బలమైన పునాది వేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అన్నారు. హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ అభ్యాసన పుస్తకాలు, ఆటవస్తువులను అందించారు. కేంద్రంలో అందుతున్న ప్రీ-స్కూల్ విద్య, పోషకాహార సేవలు, బోధన సామగ్రి వినియోగాన్ని పరిశీలించి చిన్నారుల అభ్యాస పురోగతిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలను సమగ్రంగా అందిస్తూ చిన్నారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం లేదన్నారు. మీ పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించండి. అత్యుత్తమ వాతావరణంలో వారిని తీర్చిదిద్దుతాం. మా అంగన్‌వాడీ టీచర్లకు మంచి నైపుణ్యం ఉంది.. ఇంగ్లీష్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల సామర్థ్యం అంగన్‌వాడీ వ్యవస్థకు ఉంది అని అన్నారు. ప్రతి చిన్నారి అంగన్‌వాడీలో చేరేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గతంలో అంగన్‌వాడీల్లో యూనిఫాంలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు మంత్రి సీతక్క. కానీ తమ ప్రభుత్వం ప్రతి చిన్నారికి రెండు జతల యూనిఫాంలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే 57 రకాల విద్యా, ఆట వస్తువులు, ఎర్లీ చైల్డ్ కేర్ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో 9 లక్షల మంది చిన్నారులు నమోదు అయ్యారని పేర్కొన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఖిచిడీ, ఎగ్ బిర్యానీ వంటి పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు.
కార్యక్రమం అనంతరం మంత్రి సీతక్క అవగాహన ర్యాలీని ప్రారంభించి “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట”, “ప్రైవేట్ నర్సరీ వద్దు.. అంగన్‌వాడీ ముద్దు” అంటూ నినాదాలు చేయిస్తూ అంగన్‌వాడీ విద్యా వ్యవస్థ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, జాయింట్ డైరెక్టర్ మోతి, శాఖ అధికారులు, గోల్కొండ ప్రాజెక్టు సీడీపీఓ రేణుక‌, సూపర్వైజర్లు, అంగన్‌వాడీ టీచ‌ర్లు, తదితరులు పాల్గొన్నారు.