VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 93వ జయంతి కార్యక్రమం శనివారం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో నిర్వహించారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ రోశయ్య విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన రోశయ్య.. రాజకీయాల్లో ఎదిగిన తీరు, ఆయన చేసిన సేవలు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయం అని అన్నారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కేఎస్‌ఆర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్(KSR EDUCATIONAL Foundation) లోగోను మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ తో కలిసి ఆవిష్కరించారు. అలాగే 200 మంది మెరిట్ విద్యార్థినీ విద్యార్థులకు గోల్డ్ మెడల్, స్కాలర్షిప్, సర్టిఫికెట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నాయకులు రేణిగుంట్ల గణేష్ గుప్త, చింతల రవి గుప్త, ఆగిరి వెంకటేష్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.







