నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు తలపెట్టిన సమావేశానికి రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి నెహ్రూ తోపాటు పలువురు ఎంపీలు కలిశారు. డీలిమిటేషన్ పై మార్చి 22న జరిగే సమావేశానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సరైన విధానాలు లేకుండా లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని పునరుద్ఘటించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా తలపెట్టిన డీలిమిటేషన్ ఎత్తుగడకు వ్యతిరేకంగా అవసరమైతే జాతీయ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.
“పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది సహా ఇతర రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై చర్చించడంతో పాటు కేంద్రం కుట్రలను నిలువరించేలా తదుపరి కార్యాచరణ తీసుకోడానికి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ గారిని అభినందిస్తున్నాను. మా పార్టీ హైకమాండ్ అనుమతి తీసుకొని ఈనెల 22న చెన్నై వేదికగా జరగబోయే సమావేశానికి హాజరువుతాను”అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.