నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు తలపెట్టిన సమావేశానికి రావాలని బీఆర్ఎస్ పార్టీని తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది. గురువారం హైదరాబాద్ లో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను తమిళనాడు మంత్రి నెహ్రూ, ఎంపీ ఇలంగో కలిశారు. డీలిమిటేషన్ పై మార్చి 22న జరిగే సమావేశానికి రావాలని కేటీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మట్లాడుతూ.. డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలన్నారు.
“తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సమష్టిగా పోరాడినట్లయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. 1970-80 దశకంలో ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలను కొత్తగా వచ్చిన సెన్సెస్ ప్రకారం నిర్ణయిస్తాం అనడం అన్యాయం. ఫలితంగా పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఈ విషయంలో స్టాలిన్ గారు ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరఫున హాజరు కావాలని కేసీఆర్ గారు ఆదేశించారు. కేసీఆర్ గారి ఆదేశం ప్రకారం మార్చి 22న జరిగే సమావేశానికి హాజరై బీఆర్ఎస్ వాదనను బలంగా వినిపిస్తాం“ అని కేటీఆర్ పేర్కొన్నారు.