భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ… ఈ దేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉందనీ, తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, భారతీయ జనతా పార్టీ మరోవైపు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు ఇంకోవైపు ఉన్నా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పార్టీ పెట్టి నడపడం ఆషామాషీ విషయం కాదన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన తెలంగాణ ప్రజాసమితిని చూసిన ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందన్న నమ్మకం చచ్చిపోయిందని పేర్కొన్నారు. కానీ 2001లో ఒక్కడిగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే ఏ ఒక్క కాంగ్రెస్ నేత సమాధానం చెప్పడం లేదని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే మరిప్పుడు కాంగ్రెస్ కట్టిన ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మీద ఉన్న ద్వేషంతో మేడిగడ్డను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారని తెలిపారు. అలాగే కృష్ణానదిలో 36% నీళ్లను కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 24% నీళ్లను కూడా వాడుకోలేదు అన్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయి అంటే కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం అని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే పేదల కోసం ఎలా పనిచేయవచ్చో పదేండ్ల పాటు చూపిస్తూ దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ చేసిన నాయకత్వం కేసీఆర్ ది అని చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ పేర్కొన్నారు. తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడం మాకోసం కాదు ప్రజల కోసం.. తెలంగాణ బాగు కోసం మాత్రమే మళ్ళీ అధికారం కోరుకుంటున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని ఏప్రిల్ 27న జరిగే వరంగల్ సభకు తరలి రావాలని అన్నారు. మరొక్కసారి గులాబీ సైన్యం కదం తొక్కాలిని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తాం. వారికే అవకాశాలు ఇస్తాం. చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాటనామ సంవత్సరమే అన్న కేటీఆర్.. అందుకు ఏప్రిల్ 27న తొలి అడుగు పడబోతుందన్నారు.