Home తాజా వార్తలు మహిళా సంఘాలకు త్వరలో సూపర్ బజార్లు: సీఎం

మహిళా సంఘాలకు త్వరలో సూపర్ బజార్లు: సీఎం

VGన్యూస్: మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభించడానికి వీలుగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు ముఖ్యమంత్రి  సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకుల నుంచి వీటికి అవసరమైన రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ఆర్టీసీకి రూ.10 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సంఘాల రుణాలపై జీరో వడ్డీ కింద ప్రభుత్వం రూ. 1390 కోట్లు చెల్లించిందని తెలిపారు. అలాగే జూన్ 5వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మరో 553 బస్సులను అందించబోతున్నాం అని ప్రకటించారు. మహిళలు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి వీలుగా ఈ నెల 29న వీ-హబ్ ద్వారా ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ కింద అవసరమైన వ్యాపారాల ప్రణాళికలను అందించే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. 2034 నాటికి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మంత్రిమండలి మొత్తం మహిళలందరినీ సొంత సోదరీమణులుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇందిరమ్మ చీరల డిజైన్లను విడుదల చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు