Home తెలంగాణ ‘పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ’

‘పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ’

VGన్యూస్: యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలకు ఆర్థిక స్వావలంబన, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని శాంతా బయోటెక్నాలజీస్‌లో మెదక్‌ కలెక్టర్‌, స్థానిక పాలనా యంత్రాంగం, ITDC భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక జాబ్‌ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 1,000 పరిశ్రమలు ఉన్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలకు ఏ నైపుణ్యాలు అవసరమో ముందుగానే గుర్తించి, యువతకు అదే దిశలో శిక్షణ అందిస్తే ఉద్యోగ అవకాశాలతో పాటు పరిశ్రమల ఉత్పాదకత కూడా పెరుగుతుందని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ITI, పాలిటెక్నిక్‌ కోర్సుల పాఠ్యప్రణాళికల్లో మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. PM-SETU కార్యక్రమం కింద రాష్ట్రానికి నాలుగు క్లస్టర్లు మంజూరయ్యాయని చెప్పారు.
మెదక్‌ ఖిల్లా చారిత్రక, పర్యాటక ప్రాధాన్యతను గుర్తిస్తూ తపాలా శాఖ ప్రత్యేక తపాలా కవర్‌ను విడుదల చేయడం అభినందనీయమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రత్యేక తపాలా కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అలాగే మనోహరాబాద్‌ మండలం కుచారంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో రూ.3.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అదనపు మౌలిక వసతులను మంత్రి ప్రారంభించారు. విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించి, వారితో ముచ్చటించారు. విద్యార్థినులు చిన్న వయసులోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని మంత్రి సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపి అదనపు తరగతులు నిర్వహించి ప్రోత్సాహం అందించాలన్నారు.