VGన్యూస్: రాష్ట్రంలోని నీటిపారుదల శాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువ వ్యవస్థలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జలసౌధలో నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ కేవలం ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకే పరిమితం కాకుండా స్వంత విద్యుత్ వనరులను సృష్టించుకునే దిశగా ముందడుగు వేయాలని అధికారులకు సూచించారు. దీర్ఘకాలికంగా విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను పెంపొందించేందుకు సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అవకాశాలను విస్తృతంగా పరిశీలించాలని అధికారులకు ఆయన సూచించారు.
సమావేశంలో అధికారుల ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలోని సుమారు 16 జలాశయాల వద్ద సాధ్యతా అధ్యయనాలు నిర్వహించినట్లు తెలిపారు. అనుకూలమైన జలాశయాలు, నీటిపారుదల భూముల్లో కేవలం 10 శాతం విస్తీర్ణాన్ని మాత్రమే వినియోగించినా.. దాదాపు 6,000 నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సృష్టించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, నోడల్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.







