VGన్యూస్: ఈనెల 16న జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై మంగళవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ తో కలిసి వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మొహర్రం కార్యక్రమాలు నిర్వహించే ఆశుర్ ఖానాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆశుర్ ఖానాల పరిసర ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న డ్రైనేజ్, రోడ్లు మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని, అన్ని చోట్ల హైమాస్ట్ లైట్లను ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీస్ ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఆశుర్ ఖానాలకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు.






