Home తాజా వార్తలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అందరికీ ఇళ్లను మంజూరు చేయాలి: సీఎం

ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అందరికీ ఇళ్లను మంజూరు చేయాలి: సీఎం

VGన్యూస్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో సోమవారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన సిడం కన్నీబాయి, టెకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయిలు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ గృహాలలో వారితో కలిసి సీఎం స్వయంగా గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నూతన సాంకేతికతతో నిర్మించిన ఇళ్లను పరిశీలించి ఆదివాసి బిడ్డలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మెుదట సీఎం రెండో విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరించారు.
అనంతరం గ్రామ మహిళలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. “మీ పిల్లలు చదువుకోకపోతే మీ జీవితాల్లో మార్పు రాదు. చదువొక్కటే మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. చదువొక్కటే మీ జీవితాల్లో వెలుగులు నింపుతుంది..” అని చెబుతూ వారితో చదివిస్తామన్న మాట తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ఏ గూడెంలోనూ గుడిసె ఉండటానికి వీలులేదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకోసం అన్ని గూడాల్లో,తండాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 365 రోజుల్లోగా అందరికీ ఇళ్లను మంజూరు చేయాలి అని అక్కడి నుంచే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.