VGన్యూస్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రైతాంగం వద్ద ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉన్నా అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. అన్నదాతలు అధైర్య పడొద్దన్నారు. తడిచిన ధాన్యానికి కూడా ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. ప్రతి గింజా కొంటాం..రెండు రోజులు వెనకాముందు అని సీఎం రైతులకు ధైర్యం చెప్పారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల పూర్తి చేయడం వల్ల ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆ ప్రాజెక్టును చేపట్టడానికి ఏడాది కాలంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. ఈ రెండు కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. అందుకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిపై గురుతరమైన బాధ్యత ఉందని గుర్తుచేశారు. కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తే తదుపరి తీసుకోవలసిన చర్యలపై జూన్ 15 తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.
తల తాకట్టు పెట్టయినా ఇళ్లు కట్టిస్తాం:
తెలంగాణలో పేదోడు గుడిసెలో ఉండొద్దన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీలకు అతీతంగా వివక్ష లేని సంక్షేమం, అభివృద్ధి చేయాలన్నది తమ ఆలోచన అని తెలిపారు. రాష్ట్రంలో గుడిసెలు లేని గూడాలను చూడాలనుకుంటున్నా.. గ్రామ సభలు పెట్టి జాబితాలు సిద్ధం చేయండని అధికారులకు సూచించారు. అవసరమైతే నాలుగు రోజులు ఇక్కడే ఉండి గూడాల్లో ఇళ్ల అవసరాలను గుర్తించాలని జిల్లా ఇంఛార్జి మంత్రిని ఆదేశించారు. సంవత్సరం తిరిగేలోపు గూడాల్లో ఒక్క గుడిసె కూడా ఉండటానికి వీలులేదని సీఎం స్పష్టం చేశారు. తల తాకట్టు పెట్టయినా ఇళ్లు కట్టిస్తాం. పిల్లల ఫీజులు, ఉద్యోగుల పెన్షన్ల వంటి ఎన్ని కష్టాలున్నా ఇందిరమ్మ ఇళ్లకు ఒక్క బిల్లు కూడా ఆపలేదన్నారు. వచ్చే సెప్టెంబర్ 17 వ తేదీ 2026 నాటికి రాష్ట్రంలో మరో లక్ష ఇళ్లలో గృహప్రవేశాలు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, ధనసరి అనసూయ సీతక్క, డాక్టర్ వివేక్ వెంకటస్వామితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.







