VGన్యూస్: తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు.. మరెందరో పోరాట యోధులుగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమరుల త్యాగాలకు, తెగువకు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ కలను సాకారం చేసిన ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నాటి యు.పి.ఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ, రేపటి భవిష్యత్ కు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 అని పేర్కొన్నారు.
ప్రతిక్షణం తెలంగాణ హితమే పరమార్ధంగా, రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా, పేదరికం నిర్మూలనే ప్రాధాన్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ, కార్యచరణ చేసుకుంటూ రెండున్నరేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. అభివృద్దితో పాటు సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను.. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో మనం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నామన్నారు.
దేశంలోనే కాదు.. ప్రపంచానికే తెలంగాణను గేట్‌వే గా నిలబెట్టాలన్నది నా స్వప్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ – 2047 డాక్యుమెంట్ అని పేర్కొన్నారు. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.







