VGన్యూస్: రాష్ట్రంలోని దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత ద్వారా తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు. మంగళవారం మంత్రిని జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. యాదాద్రి, భద్రాచలం, బాసర, వేములవాడ తదితర ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సేవల్లో పాల్గొనే భక్తులకు అందించే శాలువాలు ప్రస్తుతం పెద్దమొత్తంలో మరమగ్గాలు, మిల్లుల్లో కృత్రిమ నూలుతో తయారవుతున్నాయని ఆయన మంత్రికి వివరించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధిస్తున్న పరిస్థితుల్లో సింథటిక్ నూలుతో తయారైన శాలువాల వినియోగాన్ని కొనసాగించడం సముచితం కాదని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. దేవాలయాల్లో చేనేతతో తయారైన శాలువాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం తగిన విధాన నిర్ణయం తీసుకోవాలని అంజయ్య మంత్రి కొండా సురేఖకు విజ్ఞప్తి చేశారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు భారతీయ సంప్రదాయాల సంరక్షణలో చేనేత కార్మికులు పోషిస్తున్న పాత్ర అమూల్యమైనదని మంత్రి కొండా సురేఖ కొనియాడారు. ఆలయాల్లో చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ పరిరక్షణతో పాటు చేనేత కార్మికుల జీవనోపాధికి ఊతం లభిస్తుందని అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి చేనేత రంగానికి మద్దతుగా తగిన చర్యలు చేపడతామని గజం అంజయ్యకు మంత్రి హామీ ఇచ్చారు. చేనేత రంగ పురోగతికి, చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.










