Home తాజా వార్తలు ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి: మంత్రి పొన్నం

ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించండి: మంత్రి పొన్నం

VGన్యూస్: ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పీఎస్-2021కు సంబంధించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ను జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల అధికారితో చర్చించి సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతో త్వరలో రూ.1 కోటి చెక్కు అందజేయడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
2023-26 మధ్యకాలంలో ప్రజా పాలన ప్రభుత్వం రూ.1,078 కోట్ల వ్యయంతో 2,815 నూతన బస్సులను కొనుగోలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాగర్‌కర్నూల్, పెద్దపల్లి డిపో పనులను వేగవంతం చేయడంతో పాటు మంజూరైన బస్ స్టేషన్‌ల శంకుస్థాపనలకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్, మెడికల్ ఇన్వాలిడేషన్ కింద మొత్తం 1,137 కారుణ్య నియామకాలు చేపట్టినట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన కారుణ్య నియామకాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వీసు నుంచి తొలగించబడిన 490 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 244 మందిని విధుల్లోకి తీసుకున్నామని, మిగిలిన కేసులను త్వరితగతిన పరిశీలించాలని సూచించారు.
కాలుష్య నియంత్రణ, ఈవీ విధానం, ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణపై దక్షిణ భారత రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఆర్టీసీ ఎండీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడి లు ,ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.