Home తాజా వార్తలు ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం

ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం

VGన్యూస్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంస్కరణలు చేపట్టిన ప్రజా ప్రభుత్వం తొలి అడుగుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు నాంది పలికింది. రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అత్యాధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS)ను బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగారు. డిజిటల్ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి.. పుట్ బాల్ ఆడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..తెలంగాణను కోటి రతనాల వీణగా మార్చే శక్తి విద్యకు మాత్రమే ఉందన్నారు. అమ్మ ఒడిలాంటి సర్కారు బడిని బతికించుకోవాలని సంకల్పించాను.. ఆరుట్లలో అందుకు నేడు శ్రీకారం చుట్టాను అని అన్నారు. ప్రైవేటు బడులకు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను తీర్చిదిద్దామన్నారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఇది మొదటి అడుగు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.