Home తాజా వార్తలు థ‌ర్మల్ కేంద్రాల‌కు స‌రిప‌డా బొగ్గు స‌ర‌ఫ‌రా చేస్తాం: సింగ‌రేణి సీఎండీ

థ‌ర్మల్ కేంద్రాల‌కు స‌రిప‌డా బొగ్గు స‌ర‌ఫ‌రా చేస్తాం: సింగ‌రేణి సీఎండీ

VGన్యూస్: వ‌ర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం కలుగుతుందని సింగరేణి ఛైర్మన్ మరియు ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును అందిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో శుక్రవారం తెలంగాణ జెన్ కో ఛైర్మన్ డాక్టర్‌ హరీష్.. సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతిని క‌లిశారు. వ‌ర్షాకాలంలో యాదాద్రి స‌హా అన్ని థ‌ర్మల్ కేంద్రాల్లోనూ విద్యుత్ ఉత్పత్తికి విఘాతం క‌ల‌గ‌కుండా నాణ్యమైన బొగ్గును త‌గినంత‌గా స‌ర‌ఫ‌రాపై చ‌ర్చించారు.
దీనిపై సింగ‌రేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి స్పందిస్తూ.. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో దాదాపు 93 శాతం బొగ్గు ఓపెన్ కాస్ట్ గనుల నుంచే వ‌స్తుంద‌న్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని థ‌ర్మల్ కేంద్రాల‌కు త‌గినంత బొగ్గు స‌ర‌ఫ‌రా కోసం ప్రణాళికాబ‌ద్ధంగా చ‌ర్యలు తీసుకుంటున్నట్లు వివ‌రించారు. వర్ష ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అన్ని ఓపెన్ కాస్ట్ గనులలో అనేక ముందస్తు చర్యలు చేపట్టామని వెల్లడించారు
సింగరేణి సంస్థ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఏడాదికి దాదాపు 28 మిలియ‌న్ ట‌న్నుల‌ బొగ్గును సరఫరా చేస్తుందన్నారు. రోజుకు 60 నుంచి 70 వేల ట‌న్నుల బొగ్గును స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు సింగ‌రేణి డైరెక్టర్లు వివ‌రించారు. తెలంగాణ విద్యుత్ అవ‌స‌రాల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా చూడాల‌ని సీఎండీ స్పష్టం చేశారు. బొగ్గు నాణ్యత విష‌యంలోనూ రాజీ ప‌డ‌కూడ‌ద‌ని స్పష్టం చేశారు. సమావేశంలో సింగ‌రేణి డైరెక్టర్లు ఎల్ వి.సూర్యనారాయణ (ఆప‌రేష‌న్స్‌), కె.వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్, తెలంగాణ జెన్ కో ఈడీ శ్రీ న‌గ్యా, డైరెక్టర్ రాజ‌శేఖ‌ర్‌, సీఈ ల‌క్ష్మయ్య, అధికారులు పాల్గొన్నారు.