Home తాజా వార్తలు వాట్సాప్ ద్వారా స్కూల్ అప్డేట్స్

వాట్సాప్ ద్వారా స్కూల్ అప్డేట్స్

VGన్యూస్: డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రజాప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా ఇకపై స్కూల్ అప్డేట్స్ నేరుగా వారి ఫోన్ కు చేరనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా రంగంలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం, తల్లిదండ్రులతో ప్రభుత్వ అనుసంధానాన్ని బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు చేరువైన, సమర్థవంతమైన డిజిటల్ సేవల అందింపులో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. వాట్సాప్ ఆధారిత పాఠశాల విద్యా సేవల ప్రారంభం తెలంగాణ డిజిటల్ పరివర్తన ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందన్నారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’ను డిజిటల్ మస్కట్‌గా పరిచయం చేశారు. పాలపిట్ట యానిమేషన్ వీడియోల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన సమాచారం, అవగాహన సందేశాలు, వీడియోలు వాట్సాప్‌లో పంపించబడతాయి. దీనివల్ల ప్రభుత్వ విద్యా సమాచార ప్రసారం మరింత సులభంగా, ఆకర్షణీయంగా, ప్రజలకు చేరువ అవుతుంది.
వాట్సాప్ ద్వారా మీసేవ ప్రస్తుతం అందిస్తున్న ప్రధాన సేవలు:
• విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు
• హాల్ టికెట్ల డౌన్‌లోడ్
• మార్కుల మెమోలు
• పరీక్షా ఫలితాలు
• ఎస్‌ఎస్‌సీ మెమోలు
• బోనఫైడ్ సర్టిఫికెట్లు
• ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లు
• ఎస్‌ఎస్‌సీ మెమో సవరణల దరఖాస్తులు
ఈ సేవల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, సమయంతో పాటు వ్యయం ఆదా అవుతోంది.
త్వరలో అందుబాటులోకి రానున్న సేవలు:
• యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ వివరాలు
• విద్యార్థుల హాజరు సమాచారం
• ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు
• మధ్యాహ్న భోజన పథకం వివరాలు
• ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు
• క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాల సమాచారం
• రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమాల వివరాలు
• విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ