VGన్యూస్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించనున్నట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(N.Ramchander Rao) తెలిపారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నితిన్ నబీన్ పర్యటన వివరాలను వెల్లడించారు. జూన్ 28 నుంచి జూన్ 30వ తేదీవరకు రాష్ట్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నట్లు తెలిపారు.
జూన్ 28న రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించి.. అదే వేదిక నుండి మరో 9 జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం అదే రోజు సాయంత్రం నాంపల్లి గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తారన్నారు. ఆ తర్వాత నితిన్ నబీన్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి.. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలతో సమావేశమవుతారని వెల్లడించారు. జూన్ 29న VBITలో జరిగే ‘వికసిత్ భారత్ యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొని.. ఆ తర్వాత వరంగల్‌కు వెళ్లి గిరిజన వర్గాల సమావేశానికి హాజరవుతారని తెలిపారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొంటారని చెప్పారు. రాత్రి బస కోసం ఆయన తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారన్నారు. జూన్ 30న ఘట్కేసర్లో జరిగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై ప్రసంగించి.. అనంతరం న్యూఢిల్లీకి బయలుదేరుతారని రామచందర్ రావు తెలిపారు.










