Home తాజా వార్తలు వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: సీఎం రేవంత్

వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: సీఎం రేవంత్

VGన్యూస్: ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది తన కల అని.. ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా అని సీఎం స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కనగల్ మార్కెట్ యార్డులో హ్యామ్ రోడ్ల (HAMRoads) నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించిన సీఎం ఆ తర్వాత నల్గొండ పట్టణానికి చేరుకుని తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TUFIDC) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ. 83 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎన్‌జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నివేదించిన ప్రతి పనినీ చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి నల్గొండ నేలమీద కృష్ణా నది జలాలను పారిస్తానని ప్రకటించారు. ఎస్ఎల్‌బీసీ పూర్తి చేయడంతో పాటు డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకారాన్ని అందిస్తానని స్పష్టం చేశారు. మూసీ కాలుష్యం కారణంగా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, నల్గొండ ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రక్షాళన చేస్తామంటే కొందరు కడుపులో విషయం పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం. నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తా అని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.