Home తాజా వార్తలు మహిళలు,చిన్నారుల సంక్షేమానికి సహకరించండి.. కేంద్రమంత్రికి సీతక్క విజ్ఞప్తి

మహిళలు,చిన్నారుల సంక్షేమానికి సహకరించండి.. కేంద్రమంత్రికి సీతక్క విజ్ఞప్తి

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుక్రవారం కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్), మిల్క్ అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి సీతక్క కేంద్ర మంత్రికి వివరించారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో ఈ పథకం కీలకంగా మారిందని పేర్కొంటూ, ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేవలం 20 శాతం మాత్రమే భరిస్తోందని, పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర వాటాను గణనీయంగా పెంచాలని మంత్రి సీతక్క కోరారు. టీనేజ్ బాలికల్లో రక్తహీనత (అనీమియా) సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక పోషకాహార కార్యక్రమాన్ని అమలు చేయాలని, ఇందుకు అవసరమైన ప్రత్యేక ఆహార పంపిణీ కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి మరో వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని మంత్రి సీతక్క ఈ సందర్భంగా కోరారు.