VGన్యూస్: ఈనాటి పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందించే విషయంలో ప్రజా ప్రభుత్వం స్పష్టమైన బాధ్యతతో పలు కార్యక్రమాలు ప్రారంభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పిల్లలకు సరైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణ, ప్రయోజకులైన దేశ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. హైదరాబాద్ నాచారం ఐడీఏ ప్రాంతంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాలామృతం కొత్త ప్లాంటును మంగళవారం సీఎం ప్రారంభించారు. అనంతరం బాలామృతం ఉత్పత్తి, ప్యాకింగ్ ప్రాసెస్ యూనిట్‌ను పరిశీలించారు. పరిసరాల్లో మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు, వారికి నాణ్యమైన విద్యను అందించడానికి ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా వారికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి. పిల్లలు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల్లో ఆనందం ఉంటుంది. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు ఆరు సంవత్సరాల వరకు బలవర్థకమైన పోషకాహారం పేద పిల్లలకు ఇవ్వాలనే ఈ నూతన బాలామృతం ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాం. పిల్లలు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, ఇలాంటి సంస్థలు రావాలి. ప్రభుత్వం వైపు నుండి అన్ని విధాల సహకారం అందిస్తాం. పిల్లల భవిష్యత్తే, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. పేద పిల్లల ఆరోగ్యం, చదువు పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పిల్లలకు నాణ్యమైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు.







