VGన్యూస్: దేశవ్యాప్తంగా ఎల్-నీనో (El Nino) పరిస్థితుల ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో తాగునీటి సరఫరా(Drinking Water Supply)పై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. శనివారం నాడు సచివాలయంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తూ, అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సింగూరు, పాలేరు వంటి కొన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గినప్పటికీ, వచ్చే 100 రోజుల పాటు రాష్ట్రంలో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు వివరించగా, దానిని కచ్చితంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న బోర్‌వెల్లను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. బోర్‌వెల్ల వద్ద రీఛార్జ్ పిట్స్, రైన్‌వాటర్ హార్వెస్టింగ్ (Rainwater Harvesting) పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. స్థానిక నీటి వనరులను బలోపేతం చేస్తూ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించే దిశగా గ్రామస్థాయిలో అవగాహన పెంచాలని సూచించారు.
మిషన్ భగీరథకు ఇంకా అనుసంధానం కాని ఆదివాసీ, గిరిజన గ్రామాలను ఏఈలు వారం రోజుల్లో సందర్శించి నివేదిక సమర్పించాలన్నారు. కొన్ని గ్రామాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వారం రోజుల్లో ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. 16వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే ఆర్థిక సంఘం నిధులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. త్వరలో మండల వారీగా సర్పంచ్లతో ఏఈ లు సమావేశాలు నిర్వహించి.. తాగునీటి తాజా సరఫరాపై.. సర్పంచ్ల సంతకాలతో నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహిస్తానని.. నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన అధికారులను ఉపేక్షించమనని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.







