VGన్యూస్: తెలంగాణ నుంచే జనసేన ప్రస్థానం మొదలైందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ సమగ్రతను కాపాడుతూ, తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు ప్రతిఫలించేలా, ప్రతిబింబించేలా సిద్ధాంతపరమైన భావజాలంతో తెలంగాణలో జనసేన పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్దాంతాలు భావజాలాన్ని నమ్మి తనతో ఇంతకాలం ప్రయాణం చేసిన నాయకులు ఇక మీదట కీలక భూమిక పోషించాలి అన్నారు.ప్రజా సమస్యలే జనసేన అజెండా కావాలన్నారు. తెలంగాణ ఆకాంక్షలు, ఆశలు తీరేలా పని చేయాలన్నారు. కొత్తగా వచ్చిన వారికి పార్టీ భావజాలం అర్ధం అయ్యేలా దిశానిర్దేశం చేయాలని సూచించారు. పార్టీ కోసం నిబద్ధతతో నిలబడిన తెలంగాణ జనసైనికులు, వీర మహిళలు, నాయకులే తన గుండె చప్పుడు అని తెలిపారు. సైద్ధాంతిక భావజాలంతో ఇంతకాలం మనం ముందుకు నడిచాం. ఇప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జనసేన పార్టీ.. ప్రజల పార్టీ అనే విషయం చాటి చెప్పాలన్నారు. తెలంగాణలో పార్టీ ప్రయాణం ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో చేరిన నాయకులకు కండువా కప్పి ఆహ్వానించారు.







