VGన్యూస్: అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్(Skyroot Aerospace ) సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పవన్ కె చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) భరత్ డాకా మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1 (Vikram-1) ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ), ప్రభుత్వం–ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కైరూట్ వ్యవస్థాపకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వారు సాధించిన విజయం భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుందని ప్రశంసించారు.







