Home తాజా వార్తలు ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలి: కాచం

ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలి: కాచం

VGన్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటై రెండు సంవత్సరాలు గడిచినా నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని వైశ్య వికాస వేదిక ఛైర్మన్ డా. కాచం సత్యనారాయణ గుప్త ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ నిధుల సాధనకై ఆగస్టు 3న ఇందిరా పార్కు వద్ద సాధన దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధన దీక్ష పోస్టర్ ను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ.. ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ కు ఛైర్మన్ ను మాత్రమే నియమించింది కానీ నిధులు కేటాయించడంలో విఫలమైందన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికై ప్రభుత్వాలు ఎప్పుడు మొండిచెయ్యి చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప.. ప్రభుత్వాలు మాత్రం తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.500 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేసి.. 15మంది సభ్యులతో కూడిన డైరెక్టర్లను నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించకపోతే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముక్కా సాంబశివరాజు, నంగునూరు రమేష్, కొత్త రవికుమార్ గుప్త, కాసం ఏక సాయి, గజవాడ సత్యనారాయణ, బుక్కా మనోహర్, మురళి, సంతోష్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.