VGన్యూస్: ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ప్రభుత్వంలోని ప్రతి ఖాళీని భర్తీ చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. శనివారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి (Sangareddy) పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులు, ప్రధానంగా రైతులు, మహిళలు, యువత ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. పేదవారు ఆకలిలో అలమటించరాదని, ఎవరి ముందు చేయి చాచి నిలబడాల్సిన అవసరం లేదన్న సంకల్పంతోనే దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనప్పటికీ తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేపట్టామని సీఎం గుర్తుచేశారు.
వ్యవసాయం దండగ కాదు. పండుగ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 1.70 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగంపై ఖర్చు చేశామన్నారు. ఇందిరమ్మ రాజ్యం (Indiramma Rajyam) అంటేనే మహిళా ప్రభుత్వం.. కోటి మంది కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో వితంతువులు, ఒంటరి మహిళలు అందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది. అలాగే, చేనేత కార్మికులు, గీత కార్మికులు, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల బారిన పడిన వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొందరు నిరుద్యోగ యువకులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఉన్నవీ లేనివీ చెప్పే వారి మాయలో పడకండి. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఈ మధ్య కాలంలో మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశాం. ఉద్యోగాలు భర్తీ (Government Job Notifications) చేసే బాధ్యత తమది. ఏ ఖాళీలను గాలికి వదిలేయం. పోటీ పరీక్షలకు సిద్ధం కండి. అన్ని పరీక్షలు నిర్వహించే బాధ్యత తనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రజల ఆశీర్వాదముంటే సాధించలేనిది ఏదీ లేదు. ప్రజలకు ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటామన్నారు.







