VGన్యూస్: కొణిజేటి రోశయ్య రాజకీయ జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రోశయ్య రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత, విలువలకు ప్రతీకగా నిలిచారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్టు సంయుక్త రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 93వ జయంతి సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ హాజరై.. రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావును రాష్ట్ర మంత్రులు ఘనంగా సత్కరించారు. అనంతరం కేఎస్‌ఆర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రోశయ్యతో రాజకీయంగా తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసే వారు అని తెలిపారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా.. రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో సర్కారుకు సూచనలు చేసేవారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో సేవలందించిన రోశయ్య శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, అనంతరం తమిళనాడు గవర్నర్‌గా అనేక కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఆర్థిక వ్యవహారాలపై ఆయనకున్న అపారమైన పట్టు, ప్రజాధనాన్ని అత్యంత బాధ్యతాయుతంగా వినియోగించాలనే దృక్పథం ఆయనను దేశంలోనే విశిష్ట నాయకుడిగా నిలబెట్టిందన్నారు. రాజకీయ భేదాలకు అతీతంగా అందరి గౌరవాన్ని సంపాదించిన అరుదైన నాయకుడు రోశయ్య గారేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ హుందాతనం, సంయమనం, బాధ్యతతో వ్యవహరించడం ఆయన నాయకత్వానికి నిదర్శనమని మంత్రి అన్నారు.
నేటి రాజకీయ నాయకులు, యువత రోశయ్య నిరాడంబర జీవనశైలి, ప్రజాసేవ పట్ల అంకితభావం, విలువలతో కూడిన రాజకీయాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా రోశయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మంత్రి.. తాను ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన రాజకీయ గురువు చొక్కారావుతో కలిసి అనేకసార్లు రోశయ్యను కలిసే అవకాశం లభించిందన్నారు. ఆ సమయంలో రోశయ్య పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారని, తాను ఎంపీగా ఉన్న కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి నాయకత్వం వహించారని తెలిపారు. అలాగే ఆయన తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సమయంలోనూ, వివిధ హోదాల్లో ఉన్న సమయంలోనూ కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు.
ఆర్థిక క్రమశిక్షణ అంటే రోశయ్య జీవితమే నిదర్శనం. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆర్థిక క్రమశిక్షణ అత్యంత కీలకం. రోశయ్య విలువలు, క్రమశిక్షణ, ప్రజాసేవను ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించగలరు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే వినోద్, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వైశ్య కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ కాల్వ సుజాత, ఐఏఎస్ అధికారి వాణి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త, ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.










