బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
“ తెలంగాణ రైతాంగం తరుఫున, ఆడబిడ్డల తరుఫున, ఆరు గ్యారంటీల అమలు గురించి ప్రశ్నిస్తే తట్టుకోలేక జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ నుంచి సస్పెండ్ చేసింది. ప్రజల తరఫున శాసనసభలో బీఆర్ఎస్ ఉంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు జగదీష్ రెడ్డి గారు స్పీకర్ గారిని ఒక్కమాట కూడా అగౌరవంగా పొరపాటున కూడా మాట్లాడలేదు. కానీ జగదీష్ రెడ్డి గారు అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరించి సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేయడం అన్యాయం” అని కేటీఆర్ పేర్కొన్నారు.