VGన్యూస్: పరిపాలనలో మరింత పారదర్శకత కోసం వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ దిశగా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి అవసరమైన మేరకు చట్టాలను రూపొందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై మంగళవారం సీఎం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరే విధంగా డిజిటల్ గవర్నెన్స్ (Digital Governance) అమలు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు అందించేలా వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 4,800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా, ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్‌తో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలని సూచించారు.
ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరిగినప్పటికీ సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసేందుకు వీలుగా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ఆదేశించారు. హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిటలైజ్ చేయాలని సూచించారు. నిరంతరం మానీటరింగ్ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సలహాదారు కె. రామకృష్ణారావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ ఛైర్మన్ శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






