VGన్యూస్: బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రజలు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారని ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. అంబర్పేట్ మహంకాళి అమ్మవారి బోనాల (Amberpet Bonalu) ఉత్సవాల ఏర్పాట్లపై వి. హనుమంత రావు బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 9న అంబర్ పేట్ మహంకాళి ఆలయంలో అమ్మవారి బోనాలు జరగనున్నందున ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, ట్రాన్స్ కో, పోలీస్, జలమండలి, వైద్యారోగ్యశాఖ, కల్చరల్ డిపార్ట్ మెంట్ లు సమన్వయంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆలయాల మౌలిక వసతుల మెరుగుదల, భక్తులకు సౌకర్యాల కల్పన, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సీసీ కెమెరాలు, క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ బోనాలకు అధికసంఖ్యలో భక్తులు పాల్గొంటున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను కేటాయించినందుకు సీఎంకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో శాసనమండలి విప్ బల్మూర్ వెంకట్, అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.










