VGన్యూస్: సింగరేణితోపాటు అనుబంధ సంస్థ అయిన ఆప్మెల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్)ను బహుముఖంగా విస్తరించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. విజయవాడలో ఉన్నఆప్మెల్(APHMEL) స్వర్ణోత్సవాల సందర్భంగా ప్లాంట్ లో ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ (Solar Plant )ను సింగరేణి సీఎండీ బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్లాంటులో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లు, ఆర్ సి రోడ్లను కూడా ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. 50 ఏళ్ల ఆప్మెల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.63.13 కోట్ల టర్నోవర్, రికార్డు స్థాయిలో రూ.23.33 కోట్ల నికర లాభాలను ఆర్జించడంపై ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. గత ఏడాది ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆప్మెల్‌ను సందర్శించిన సమయంలో ఇచ్చిన దిశానిర్దేశం, స్ఫూర్తితో సాధించిన విజయంగా అభివర్ణించారు. అలాగే ప్లాంట్‌ను సందర్శించిన సమయంలో ప్లాంట్ లో సౌకర్యాల మెరుగుదలకు హామీ ఇచ్చారన్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల పైన ప్లాంట్ ఆవరణలో సీసీ, ఆర్ సీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు.







