Home రాజకీయం తరతరాలకు స్ఫూర్తి ‘కొణిజేటి’

తరతరాలకు స్ఫూర్తి ‘కొణిజేటి’

ఆరడుగుల ఎత్తు… అచ్చ తెలుగు పంచెకట్టు… నిండైన ఆహార్యం … ముఖంపై చిరునవ్వు… ఆర్థిక, రాజకీయ క్రమశిక్షణకు మారుపేరు… బహుముఖ ప్రజ్ఞాశాలి… స్వపక్షంతోనే కాదు విపక్షంతోనూ మన్ననలు పొందిన గొప్ప నాయకుడు కొణిజేటి రోశయ్య. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే మనస్తత్వం. రాజకీయాల్లో మచ్చలేని మహానేత. సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో ఆయన దిట్ట. మనిషి సాదాసీదాగా కనిపించినా… ప్రత్యర్థులకు మాత్రం రోశయ్య ఒక సింహస్వప్నం.

ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సామాన్య కార్యకర్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసి స్వశక్తితో ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ పదవులను అనుభవించిన అరుదైన నాయకుడు కొణిజేటి రోశయ్య.                                                                                                                                                    నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు :

గుంటూరులోని హిందూ కళాశాలలో డిగ్రీ చదివే రోజుల్లోనే రోశయ్యకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. ఆ కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆతర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నాయకుడు ఆచార్య ఎన్‌.జి.రంగా నిడుబ్రోలులో స్థాపించిన రైతాంగ విద్యాలయంలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. 1968లో స్వతంత్ర పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టిన రోశయ్య… ఆ తర్వాత తన రాజకీయ జీవితంలో వెనుతిరిగి చూడలేదు. రాజకీయ చైతన్యం కల్గిన గుంటూరు జిల్లా అందించిన ముఖ్యమంత్రుల్లో రోశయ్య నాల్గవవారు. గతంలో  సీఎంలుగా పనిచేసిన  కాసు బ్రహ్మానందరెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఆజిల్లా వాసులే.

ముఖ్యమంత్రి కావటానకి ముప్పై ఏళ్లు :

వాక్పటిమ,నిరంతర అధ్యయనం, పరిపాలన సామర్థ్యం, పార్టీ పట్ల విధేయత లాంటి సద్గుణాలే రోశయ్య రాజకీయ జీవితానికి వన్నెతెచ్చాయనటంలో ఎలాంటి సందేహం లేదు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రోశయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి తొలిసారిగా 1979లో మంత్రి పదవిని కట్టబెట్టారు. అప్పటి నుంచి పలువురి ముఖ్యమంత్రుల వద్ద వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తనకు అప్పగించిన అన్ని శాఖలను సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందిన రోశయ్య… ముఖ్యమంత్రి కావటానికి సుమారు 30 ఏళ్లు పట్టింది. ఎన్ని ఉన్నతమైన పదవులు చేపట్టినప్పటికీ ప్రజా సమ్యసల పరిష్కారం కోసం నిరంతరం అధ్యయనం చేయటం వల్లనే అన్నీ పార్టీలను, సబ్బండ వర్గాల ప్రజలను ఆయన ఆకట్టుకోగలిగారు.

1968 జూలై 11న తొలిసారి శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏళ్లపాటు చట్టసభల్లో సభ్యులుగా ఉంటూ మాట్లాడని వారిని చూశాం. కానీ రోశయ్య ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే శాసనమండలిలో దుకాణాలు,వాణిజ్య సంస్థల బిల్లుపై తన గళం వినిపించారు. అలాగే ప్రజా సమస్యలతోపాటు పలు బిల్లులపై స్పష్టంగా తన వాదనలు వినిపించారు. ప్రతిపక్ష సభ్యుడిగా ఉంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని సమర్థించిన సందర్భాలు ఉన్నాయి. భూసంస్కరణ చట్టాన్ని సమర్థించి ఆనాటి ప్రభుత్వాన్ని అభినందించారు. అంతేకాదు పాలకపక్ష సభ్యుడిగా రోశయ్య తన వాగ్ధాటితో ప్రతిపక్షలను సైతం ఒప్పించగల్గిన ధీశాలి. భావితరం రాజకీయ నాయకులకు రోశయ్య చట్టసభల్లో చేసిన ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఆర్థిక శాఖ ఆయనదే :

హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే చాలు ముఖ్యమంత్రి ఎవరైనా కావొచ్చు… కానీ మంత్రిమండలిలో రోశయ్యకు చోటు ఖాయం అనే భావన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఉండేది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి , అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాల్లో కీలకమైన శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించేవారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలనూ సమన్వయం చేసుకోవడం ఏ సర్కారుకైనా కత్తిమీద సామే. ఆ రెండింటినీ సమతూకం చేయటంలో రోశయ్య దిట్ట. అందుకే సీఎం ఎవరైనా… ఆర్థిక మంత్రి పదవి రోశయ్యనే వరించేది.

అజాత శత్రువు:

కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నా.. రోశయ్య వారితో సఖ్యతగానే ఉండేవారు. రాజకీయంగా తనకంటే సీనియర్లా, జూనియర్లా అన్న భేషజాలకు ఆయనెప్పుడూ పోలేదు. అందరికీ సలహాలు,సూచనలు ఇచ్చేవారు. రోశయ్య ఉన్నారనే ధీమాతో సభా కార్యక్రమాల నిర్వహణ భారం ఆయనపై మోపేవారు. అస్తవ్యస్త రాజకీయాలకు దూరంగా ఉండేవారు. అవినీతి అంతకంటే లేదు. వ్యవస్థలను, వ్యక్తులను గౌరవించడం, అదే గౌరవాన్ని ఆయన ఆశించారు. పాలకపక్షంతోనే కాదు ప్రతిపక్షంతోనూ మన్ననలను పొంది అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, గవర్నర్ గా ఏ పదవిలో ఉన్న రోశయ్య నిరాడంబరంగానే ఉండేవారు.

అధిష్ఠానానికి ఆప్తుడు :

ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన రోశయ్య… కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. క్రమశిక్షణతో పనిచేయటం, పార్టీని బలోపేతం చేయటంకోసం నిరంతరం కృషిచేశారు. అలాగే అధిష్ఠానం పట్ల విధేయుడిగా ఉండటమే ఆయనకు కలసి వచ్చింది. 1995-97లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రోశయ్యను… అధిష్ఠానం ఆ తర్వాత పీసీసీ అధికార ప్రతినిధిగా నియమించినా ఎలాంటి భేషజాలకు పోకుండా తన విధిని సమర్థవంతంగా నిర్వహించారు. పార్టీ ఆదేశాలకు ఆయన ఎంత విలువనిచ్చేవారో అర్థం అవుతోంది. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ అధినాయకత్వం రోశయ్యకు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్ గా, రెండు నెలల పాటు కర్ణాటక ఇంఛార్జి గవర్నర్ గా కీలకమైన బాధ్యతను అప్పగించి ఆయనకు తగిన గుర్తింపునిచ్చారు.

గౌరవ డాక్టరేట్ ప్రదానం :

2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. అలాగే 2018 ఫిబ్రవరి 11న లలితా కళాపరిషత్ ఆధ్వర్యంలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.

ఆర్థిక వ్యవహారాల్లో ఆరితేరిన అతిరథుడు… నొప్పింపక తానొవ్వక పనులు చక్కబెట్టడంలో దిట్టగా పేరొందిన మహానేత రోశయ్య. చట్టసభల్లో బడ్జెట్ పద్దులు, విధాన పరమైన అంశాలపై ప్రసంగాలు చేసి సభ్యులను మంత్రముగ్దులను చేయటం ఆయనకే సాధ్యం. ఏదైనా తప్పు దొర్లితే క్షమించమని కోరే మనస్తత్వం కల్గిన నాయకుడు. తన ప్రజా జీవితంలో ఎలాంటి అవినీతి మచ్చలేని నాయకుడిగా ఎదిగిన తీరు  భావితరం రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొణిజేటి రోశయ్య అనారోగ్యంతో 2021 డిసెంబర్ 4న  హైదరాబాద్ లో కన్నుమూశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here