Home తాజా వార్తలు 30 రోజుల్లో నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం: మంత్రి అడ్లూరి

30 రోజుల్లో నిజాంపేట డంపింగ్ యార్డ్ తరలిస్తాం: మంత్రి అడ్లూరి

VGన్యూస్: నిజాంపేట డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా తరలిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం బాచుపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డిగ్రీ కళాశాల నూతన భవన ప్రాంగణం సమీపంలోని డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరితో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా తెలుసుకున్నామన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా డంపింగ్ యార్డు తరలింపు అత్యవసరమైందని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. డంపింగ్ యార్డు పరిసరాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయన్న ప్రజల ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. డీసీపీతో మాట్లాడి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశిస్తామన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో రూ.20 కోట్ల వ్యయంతో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల కోసం ఆధునిక హాస్టల్ నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలో గురుకుల విద్యార్థులు ఇక్కడికి రానున్న నేపథ్యంలో పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.