VGన్యూస్: తమ ప్రాణాలకు తెగించి విశిష్ట సేవలు అందిస్తున్న అటవీ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గురువారం వన మహోత్సవం – 2026 ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంపద సంరక్షణలో ప్రాణాలకు తెగించి పోట్లాడుతున్న అటవీ శాఖ సిబ్బందిని ప్రోత్సహిస్తూ ” తెలంగాణ స్టేట్ వన సంరక్ష మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ రూల్స్–2026 (తెలంగాణ రాష్ట్ర వన సంరక్షణ ప్రతిభా పురస్కార పతక నియమావళి )” ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. అటవీ శాఖలో సేవాస్ఫూర్తి, అంకితభావం, విధి పట్ల నిబద్ధతను మరింత పెంపొందించడంతో పాటు అటవీ సంపద రక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచే సిబ్బందిని ప్రోత్సహించడమే ఈ పురస్కారాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పురస్కారాలు అటవీ సంపద పరిరక్షణలో ఉద్యోగులు, సిబ్బంది ఉత్తమ సేవలు అందించేందుకు ప్రేరణనందిస్తాయని తెలిపారు. ప్రజలు, ఉద్యోగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
నాలుగు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి వన శౌర్య పతకం (ప్రత్యేక బంగారు పతకం), తెలంగాణ విశిష్ట వన సంరక్ష పతకం (బంగారు పతకం) , తెలంగాణ ఉత్తమ వన సంరక్ష పతకం (వెండి పతకం), తెలంగాణ వన సంరక్ష పతకము (రజత పతకం) పేర్లతో నాలుగు పురస్కారాలను ప్రవేశపెట్టింది. తెలంగాణ వన సంరక్ష పథకానికి రూ.10,000, ఉత్తమ వన సంరక్ష పథకానికి రూ.15,000, విశిష్ట వన సంరక్ష పథకానికి రూ.20,000, ముఖ్యమంత్రి వన శౌర్య పథకానికి రూ.25,000 నగదు బహుమతిని అవార్డు గ్రహీతలకు అందజేయనున్నారు. అదనంగా నెలవారీ నగదు ప్రోత్సాహకం కూడా ఇస్తారు.
అటవీ భూములను ఆక్రమణల నుంచి కాపాడడం, అటవీ నేరాల నియంత్రణ, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ అభివృద్ధి కార్యక్రమాల అమలు, నర్సరీల నిర్వహణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(GIS), మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS), పరిశోధన తదితర రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఈ అవార్డులకు ఎంపిక చేయనున్నారు.







