Home తాజా వార్తలు దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క

VGన్యూస్: దివ్యాంగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన హెలెన్ కెల్లర్(Helen Keller) జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంలో మరో కీలక అడుగు వేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్రంలోని 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఈ-ఆటోలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికే స్ఫూర్తి అని అన్నారు. చిన్న వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా సంకల్పబలంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె చెప్పిన “ఒంటరిగా మనం చాలా తక్కువ చేయగలం.. కలిసి ఉంటే ఎంతో సాధించగలం” అనే సందేశం ఈ కార్యక్రమానికి సరిగ్గా సరిపోతుందని అన్నారు. దివ్యాంగులను జాలి చూపాల్సిన వారిగా కాకుండా సమాజ అభివృద్ధిలో సమాన భాగస్వాములుగా చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ విధానమని మంత్రి స్పష్టం చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి త్రిచక్ర వాహనాలు, జీవనోపాధి అవకాశాలు, స్వయం సహాయక సంఘాలు, నైబర్‌హుడ్ సెంటర్లు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ-ఆటోలు కేవలం వాహనాలు కాదని, ఎన్నో కుటుంబాలకు ఆశను, దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని అందించే సాధనాలని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు రవాణా సమస్యల వల్ల పిల్లలను కేంద్రాలకు తీసుకురాలేకపోయిన కుటుంబాలకు ఇకపై ఇంటి వద్ద నుంచే ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యంగా ఆటిజం, మేధోవైకల్యం తదితర వైకల్యాలు ఉన్న పిల్లలు క్రమం తప్పకుండా థెరపీ, శిక్షణ పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమానికి సహకరించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి ప్రజలు సూచనలు ఇవ్వాలని, వాటిని ప్రభుత్వ విధానాల్లో అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.