Home తాజా వార్తలు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

VGన్యూస్: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొంతమంది కార్మిక సంఘాల నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమని ఆయన అన్నారు.
ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో లతో కలిసి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తో పాటు ఉన్నతాధికారులు, ప్రతి కార్మిక సంఘం నుంచి ఇద్దరు చొప్పున దాదాపు 30 మంది కార్మిక సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా 14 గంటల పాటు చర్చించి అందరి ఆమోదంతో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి గుర్తు చేశారు. సమావేశంలో మొత్తం 32 డిమాండ్లలో 29 అంశాలు ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో, మూడు అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు నిర్ణయించడం జరిగిందన్నారు. యాజమాన్యం పరిధిలో ఉన్న 29 అంశాల పరిష్కారానికి ఈడీల కమిటీ ద్వారా ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న మూడు కీలక అంశాలైన ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు, 2021 పీఆర్సీ, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ప్రకటించిన 11 శాతం జూలై నెల జీతాల నుంచే అమల్లోకి రానుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల మొదటి డిమాండ్ ఆర్టీసీ గుర్తింపు సంఘాలు ఎన్నికలు అని ఇప్పుడు మాట మార్చి ప్రజలను,కార్మికులను పక్కదోవ పట్టించడం సరికాదన్నారు.
ఆర్టీసీ విలీనానికి సంబంధించి విధివిధానాలు రూపొందించే అధికారుల కమిటీలో కార్మిక ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని సమావేశంలో కార్మికులు ఏకగ్రీవంగా నిర్ణయించారని మంత్రి పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం ఇప్పటికే గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని, లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను ఎన్నికల నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి త్వరలోనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించే దిశగా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మాదిరి విలీనం తర్వాత ఇబ్బందులు కలగవద్దని.. గుర్తింపు కార్మిక సంఘాల నేతలను కమిటీ లో చేర్చి విధివిధానాలు రూపొందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది కార్మిక సంఘాల నాయకులు గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగకుండా, విలీన ప్రక్రియను కూడా వివాదాస్పదం చేసేలా వ్యవహరించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని, కార్మికులు వాస్తవాలను గుర్తించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.