Home తాజా వార్తలు ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో సంవత్సరం పాటు కొనసాగించాలి: ఎమ్మెల్సీ కోదండరాం

ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో సంవత్సరం పాటు కొనసాగించాలి: ఎమ్మెల్సీ కోదండరాం

VGన్యూస్: ఎస్ఐఆర్ (SIR – Special Intensive Revision) ప్రక్రియ నిబంధనలు సవరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ నిరసన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొ.కోదండరాంతోపాటు టీజేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదన్నారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం స్పష్టం చేశారు. కనీసం ఒక సంవత్సరం పాటు ఈ ప్రక్రియను కొనసాగిస్తేనే ఓటర్లకు తగిన అవకాశం లభిస్తుందని అన్నారు. గతంలో ఎస్‌ఐఆర్ నిర్వహించిన రాష్ట్రాల్లో తగిన సమయం లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా లక్షలాది మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివిధ కారణాలు చూపుతూ పౌరుల ఓటు హక్కును తొలగించే పరిస్థితులు తలెత్తకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.