Home తాజా వార్తలు రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు: సీఎస్

రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు: సీఎస్

భారత్ ఔద్యోగిక వికాస్ యోజన (BHAVYA) పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ పార్కుల (Industrial Parks) ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ భవ్య పథకంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్క్ ల పురోగతిపై బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. భవ్య పథకంలో మొదటి దశలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసే 4 ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ ను కేంద్రానికి ఈనెలాఖరులోగా అందచేస్తున్నామని తెలిపారు. ఒక్కో పార్కు 500 ఎకరాలకన్నా అధిక విస్తీర్ణంలో ఉంటుందన్నారు. ఇందుకుగాను భూసేకరణ ఇతర ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని తెలిపారు. వీటిలో కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీం పట్నం ఎలిమినేడు, ఘట్కేసర్ మండలం మాదారం, చౌటుప్పల్ మండలం దండు మైలారం ఉన్నాయన్నారు. వీటిలో ఎలక్ట్రానిక్, సాఫ్ట్ వేర్ తదితర రంగాలకు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు పలు ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయని అన్నారు. వీటితోపాటు, మరో 16 ప్రాంతాల్లో ఇండస్టీయల్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు.