ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సోమవారం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 6 వేల కోట్ల రూపాయలతో 5లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని సీఎం తెలిపారు. నైపుణ్యం ఉండీ ఉద్యోగం లభించని యువతకు ఈ పథకం కింద ప్రాధాన్యత కల్పించాలన్నారు. స్వయం ఉపాధి కింద అసలైన, అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాసం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కల్పించవచ్చు అన్నారు. జూన్ 2 వ తేదీన 5 లక్షల మంది లబ్ధిదారులను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.