Home తాజా వార్తలు వర్షాభావ పరిస్థితులపై సీఎం సమీక్ష

వర్షాభావ పరిస్థితులపై సీఎం సమీక్ష

VGన్యూస్: ఎల్‌నినో ప్రభావంతో వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని వాతావర‌ణ శాఖ సూచనల నేపథ్యంలో కృష్ణా, గోదావ‌రి జ‌లాల్లో తెలంగాణ వాటా జ‌లాలు ద‌క్కేలా చూడాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు డ్యామ్‌లు నిండిన త‌ర్వాతే నీళ్లు వ‌దిలే విధానాన్ని పాటిస్తే మ‌న‌కు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తీసుకోవలసిన ముందస్తు చర్యలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అంత‌రాష్ట్ర జ‌లాల్లో ప్రొరేటా ప్రకారం తెలంగాణ‌కు రావాల్సిన వాటా జ‌లాలు వ‌చ్చేలా ఆయా రాష్ట్రాల అధికారుల‌తో ముందుగానే చ‌ర్చించి త‌గిన కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని అధికారులకు సూచించారు.
సాగునీటి ప్రాజెక్టుల మెయింటెనెన్స్, పనులపై సీఎం అధికారులతో చర్చించారు. గేట్లు, ఇతర నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మెయింటెనెన్స్ కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ వ‌ర్షాకాలంలో ఎక్కడైనా డ్యామ్‌ల విష‌యంలో ఇబ్బందులు తలెత్తితే అధికారుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని ముఖ్యమంత్రి హెచ్చరించారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితిలో నష్టం సంభవిస్తే తక్షణమే స్పందించేలా కార్యచరణ ఉండాలన్నారు. రామగుండం ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా అంతా తెలంగాణ‌కే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామ‌ని సీఎం తెలిపారు. క్యూర్ ప‌రిధిలోని మూడు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వాతావరణ, వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ది, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.