VGన్యూస్: ఈ నెల 21వ తేదీన నిర్వహించబోయే నీట్ (NEET) రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC) ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి తెలిపారు. ఏసీ సర్వీసులు మినహాయించి అన్ని బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను చూపించి, తమ ఇళ్ల నుండి పరీక్షా కేంద్రాల వరకు, తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఉచితంగా రాకపోకలు సాగించవచ్చన్నారు. ఈ పరీక్షకు దాదాపు 73 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్న నేపథ్యంలో, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల మార్గాలలో తగినన్ని బస్సులను నడిపేందుకు ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.







