VGన్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూముల కేటాయించడానికి సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు దేవస్థానంకే ఉండాలని చెప్పారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధి పెవిలియన్‌లో సీఎం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
ఆలయం పరిధిలో భూముల కేటాయింపు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ ధర ప్రకారం భూమిని కేటాయించాలని సూచించారు. గుట్టపైన అతిథి గృహాల నిర్మాణం కోసం ముందుకు వచ్చే వారి జాబితా రూపొందించాలన్నారు. అతిథి గృహాల నిర్మాణాల్లోనూ టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడ అనుసరించాలని.. దశల వారిగా అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపుపైన కూడా స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం రూపొందించాలని అన్నారు.
ఆలయ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయం నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను సమగ్రంగా అధ్యయనంచేసి వారంలో నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు దేవాదాయ, ఆర్థిక శాఖల, లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు










