VGన్యూస్: ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. ప్రజావాణికి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణిలో ప్రజల నుంచి ప్రతిరోజూ అందుతున్న వినతులు, వాటి పరిష్కార స్థితి, శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి విద్యాసాగర్, అధికారులు పాల్గొన్నారు.







