Home తాజా వార్తలు ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలకం: మంత్రి తుమ్మల

ఎల్-నినో సవాళ్లను ఎదుర్కోవడంలో రైతునేస్తం కీలకం: మంత్రి తుమ్మల

VGన్యూస్: రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ‘రైతునేస్తం'(Rythu Nestham) 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1600 రైతువేదికల ద్వారా లక్షలాది మంది రైతులు మరియు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిరుపయోగంగా వదిలేసిన రైతువేదికలను రైతులకు ఉపయోగపడే విజ్ఞాన కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. రైతులతో ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలను కలిపిన కార్యక్రమం దేశంలోనే ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని అన్నదాతలకు సూచించారు. రైతునేస్తం ద్వారా రైతులకు వాతావరణ హెచ్చరికలు, జిల్లాల వారీగా అనువైన పంటలు, శాస్త్రీయ సాగు విధానాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ.. ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయశాఖ రూపొందించిన కంటింజెన్సీ ప్రణాళిక ప్రకారం రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, ఇతర సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమం ముగింపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆదర్శ రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ బి. గోపి, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, వివిధ జిల్లాల ఆదర్శ రైతులు, అధికారులు పాల్గొన్నారు.