Home తాజా వార్తలు పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: మంత్రి సురేఖ

పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: మంత్రి సురేఖ

VGన్యూస్: పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ గారు పిలుపునిచ్చారు. ఈ భూమి కేవలం మనుషుల ఆవాసం మాత్రమే కాదని, సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసం అని గుర్తించి ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని కోరారు. బుధవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దూలపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను, పులుల సంరక్షణకు సంబంధించిన లఘు చిత్రాన్ని మంత్రి వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పులి అటవీ సంపదకు ప్రతీక అన్నారు. పులిని పరిరక్షించడమంటే అడవిని, పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని, భావితరాల భవిష్యత్తును పరిరక్షించడమేనని అన్నారు. వేట, అడవుల నరికివేత, అక్రమ రవాణా వంటి కారణాలతో వాటి సంఖ్య తీవ్రంగా తగ్గిపోయిందని మంత్రి సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు భారతదేశం ప్రపంచ పులుల సంరక్షణలో అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం పులుల్లో సుమారు 75 శాతం పులులు భారతదేశంలోనే ఉన్నాయన్నారు. దేశంలో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వులు విజయవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ విషయంలో విశిష్టమైన స్థానం ఉందని మంత్రి సురేఖ అన్నారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు దేశంలోనే ప్రాముఖ్యత కలిగిన పులుల అభయారణ్యాలుగా గుర్తింపు పొందాయని తెలిపారు. అడవులను కాపాడుకుందామని, వన్యప్రాణులను సంరక్షిద్దామని, భావితరాలకు పచ్చని తెలంగాణను అందిద్దామని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. అటవీ సంపద, వన్య ప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసిన పలువురు అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశాంస పత్రం తో పాటు, నగదు బహుమతిని అందించారు. అదే విధంగా అంతర్జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రాలేఖన పోటీలో గెలిచిన విద్యార్థులకు మంత్రి సురేఖ ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు.