Home తెలంగాణ ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: ములుగు జిల్లాలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని (IDOC) ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. వేయి స్తంభాల గుడితో పోటీ పడే విధంగా వనదేవతలు సమ్మక్క – సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. ములుగు ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా జంపన్నవాగును నూటికి నూరు శాతం అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలోని ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరు. మీ కష్టాలు తీరాలంటే, సాగునీరు అందించాలి. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయంతో పాటు కోర్టు భవనాలను నిర్మించాలని మంత్రి సీతక్క చేసిన సూచనల మేరకు వాటిని త్వరలోనే చేపడుతామన్నారు. మల్లూరు నరసింహ స్వామి దేవాలయానికి కూడా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్, ఏటీసీలతో పాటు భవిష్యత్తులో సాంకేతిక విద్యను అందించడానికి, ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం ఏం కావాలన్నా నిధులను మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నర్సరీ నుండి 12వ వరకు విద్యకు ప్రాధాన్యతనిచ్చి, ఆ తర్వాత స్కిల్స్ నేర్చుకోవాలని ఈ సందర్భంగా యువతకు సూచించారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి రాణించగలరని, విద్య, సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు.